Saturday, February 13, 2010

దేశమంతా శివనామస్మరణ


దేశ వ్యాప్తంగా శుక్రవారం శివనామ స్మరణ మారుమోగింది. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో మహా శివరాత్రి పర్వదినాన్ని జరుపుకున్నారు. దేశంలోని అన్ని శివాలయాలు.. పుష్ప, విద్యుద్దీపాలంకరణలతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు, సాధువులు హరిద్వార్‌లోని కుంభ్ వద్ద గంగా నదిలో పవిత్ర స్నానాలాచరించారు.వేలాది మంది నాగసాధువుల భం భం భోలే అంటూ మంత్రోచ్ఛారణలతో.. మంగళవాయిద్యాలతో శివున్ని స్తుతించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 300 ప్రత్యేక స్నానఘట్టాలలో వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో మహా శివరాత్రి పండుగ సందర్భంగా దేవాలయాల్లోని శివలింగాలను పాలు, గంగా జలంతో అభిషేకించారు. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయానికి భక్తులు పోటెత్ారు. కుంభమేళాలో శివరాత్రి స్నానాలు పోటెత్తిన భక్తులు హరిద్వార్: ఓ వైపు కుంభమేళా జరుగుతుండడం.... అందులోనూ మహాశివరాత్రి పర్వదినం కావడంతో శుక్రవారం హరిద్వార్ వద్ద గంగా నదిలో వేలాది సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. కుంభమేళా జరుగుతుండగా శివరాత్రి రావడం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పవిత్ర సందర్భం కావడంతో గురువారం అర్ధరాత్రి నుంచే నదీ తీరం భక్తులతో పోటెత్తింది. భం భం భోలే నినాదాలతో హోరెత్తింది. కుంభమేళాలో భాగంగా సాధువులు శుక్రవారం ఉదయం 11 గంటలకు తొలి రాజ స్నానం( షాహీ స్నాన్) ఆచరించారు

రైతు సంతోషమే... దేశానికి హితం

నీటి పారుదల శాఖ బిజినెస్ స్కూల్ విద్యార్థుల సూచన.
సాగర్ ఆధునీకరణ పనులపై సామాజిక అధ్యయనం
(హైదరాబాద్) రైతులు ఎల్లవేళలా సంతోషంగా ఉంటేనే దేశానికి ఎంతో మంచిదని ఇండియన్ బిజినెస్ స్కూలు విద్యార్థులు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖాధికారులకు సూచించారు. ఆయకట్టు పరివాహక ప్రాంతంలో స్థానిక వాగులు, వంకలను అభివృద్ధిపరచాలని సూచించారు. దేశంలో మొదటిసారిగా.. రాష్ట్ర నీటి పారుదల శాఖ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని ఇండియన్ బిజినెస్ స్కూల్‌కు చెందిన విద్యార్థులతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనుల వల్ల కలిగే సామాజిక, ఆర్ధిక ఫలితాలపై అధ్యయనం జరిపించింది. 'సాగర్ కాల్వల కింద చివరి ఆయకట్టుదారులకు నీటిని ఇవ్వాలంటే.. ఏథెన్స్ ప్రాజెక్టులో ఉపయోగిస్తున్న్టుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని సూచించారు. ఆధునీకరణ పనుల వల్ల ప్రయోజనాలే అధికంగా ఉంటాయి' అని అ«ధ్యయనం చేసిన ఐఎస్‌బీ విద్యార్థులు సింధు సుబ్రహ్మణియన్, సాయిసృజన్ పొండలూర్, పృథ్వీ రాజారాం, అర్జున్ గుహ సూచించారు.

సచివాలయంలో 'ముంపు' దొంగలు

వాళ్ల గ్రామాలను రిజర్వాయర్ ముంచేసింది. పునరావాసం పేరుతో ప్రభుత్వం వంచించింది. ఉద్యోగాలిస్తామని చెప్పి అధికారులు నిలువు దోపిడీ చేశారు. దెబ్బ మీద దెబ్బ తిన్న శ్రీశైలం రిజర్వాయర్ బాధితులకు ఏబీఎన్ అండగా నిలిచింది. సెక్రటేరియట్‌లో ఉన్న దొంగల్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

సీఎం రేసులో నేనూ ఉన్నా!: జానారెడ్డి

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్‌సభలో బిల్లు జేఏసీ చెబితే రాజీనామాలు చేయం రాకపోతనే నేనే రోడ్డెక్కుతా, సీఎం రేసులో నేనూ ఉన్నా!: జానారెడ్డి
నల్గొండ/మిర్యాలగూడ, ఫిబ్రవరి 12 : శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగానే ఉంటుందని మాజీ మంత్రి కె.జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లాలో పలు శివాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన త్రిపురారం, దామరచర్ల మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సొంత నియోజకవర్గం హాలియాలో జానా ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. రాజీనామా చేయాలని పట్టుబట్టారు. 'రాజీనామాలు చేస్తే రాష్ట్రపతి పాలన వస్తుంది. అలా అయితే తెలంగాణ మరో మూడేళ్లు వెనక్కి వెళుతుంది' అని జానారెడ్డి వారికి నచ్చజెప్పారు. 'తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద అపోహ లొద్దు. జేఏసీ చెబితే రాజీనామాలు చేయం. సమస్య పరిష్కారానికి అధిష్ఠానానికి కొంత వెసులుబాటు కల్పించాలి. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి మీతో కలిసి పోరాటం చేస్తా' అని ఆయన స్పష్టం చేశారు. మొట్టమొదటి సీఎం నేనే అనలేదు.. తొమ్మిది నెలల్లో తెలంగాణ వస్తుందని.. తానే ముఖ్యమంత్రిని అవుతానని వ్యాఖ్యానించినట్లు వస్తున్నట్టు మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే.. సీఎం కావాలని కోరుకునే వారిలో తాను కూడా ఒకడినని చెప్పానే తప్ప.. తానే సీఎం అవుతానని అనలేదన్నారు. 9నెలల్లో తెలంగాణ వస్తుందని కూడా తానెక్కడా వ్యాఖ్యానించలేదన్నారు. 11 నెలల్లో నివేదిక ఇస్తుందని.. వచ్చే ఏడాది జనవరిలోనో.. ఫిబ్రవరిలోనో లోక్‌సభలో బిల్లు పెట్టే అవకాశముందని విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణ కృష్ణార్పణం

విధి విధానాలు ప్రకటించిన కేంద్రం
ప్రాతిపదికలపై భిన్నాభిప్రాయాలు

స్వాగతించిన సీమాంధ్ర కాంగ్రెస్

తెలంగాణలోనూ కొందరికి ఓకే! అటూ ఇటూ వ్యతిరేకించిన టీడీపీ తెలంగాణ వాదుల పెదవి విరుపు 'విచిత్ర' విధానాలంటూ వ్యాఖ్యలు నేడు కమిటీ తొలి సమావేశం
రణగొణ ధ్వనులను అదుపు చేయగలమని అధిష్ఠానం భావిస్తోంది. కమిటీ నివేదిక వచ్చేలోపు రాష్ట్రంలో పరిపాలనను చక్కదిద్దాలని యోచిస్తోంది. సీమాంధ్రలో పరిస్థితి చక్కబడిందని, తెలంగాణ కాంగ్రెస్ నేతలను విశ్వాసంలోకి తీసుకోగలిగితే ఇక్కడ కూడా ఇబ్బంది ఉండదని అంచనా వేస్తోంది. 'కృష్ణార్పణం' పదం ఒక్కటే! అర్థాలు మాత్రం ఎన్నో! జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి నిర్దేశించిన విధి విధానాలు సృష్టించిన సందేహాలు ఎన్నెన్నో! ఇక ప్రత్యేక రాష్ట్రం సంగతి కృష్ణార్పణమే అని తెలంాణవాదులు నిరాశ వ్యక్తం చేస్తుండగా... కేంద్రం తెలంగాణను శ్రీకృష్ణ కమిటీకి అప్పగించినందున, విధివిధానాలపై అభ్యంతరాలు ఎందుకని కొందరు సీమాంధ్ర నేతలు ప్రశ్నిస్తున్నారు. కమిటీ విధి విధానాలపై పార్టీలవారీగా, ప్రాంతాల వారీగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు దాదాపుగా అందరూ విధి విధానాలను స్వాగతించారు. ఇటు తెలంగాణలోనూ చాలామంది కాంగ్రెస్ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు మాత్రం ప్రాంతాలకు అతీతంగా అంతా పెదవి విరిచారు. ఈ విధి విధానాలపై టీఆర్ఎస్ నిప్పులు చెరిగింది. విద్యార్థి జేఏసీలదీ అదే మాట! తెలంగాణపై ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేందుకే ఈ కమిటీ ఏర్పడిందని భావించిన తెలంగాణ వాదులను ఈ విధి విధానాలు తీవ్రంగా నిరాశపరిచాయి. 'అప్రమత్తంగా ఉండండి' అని గురువారం విలేఖరులను హెచ్చరించిన కంద్ర హోంమంత్రి చిదంబరం... శుక్రవారం ఉదయం శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను చడీ చప్పుడు లేకుండా మీడియాకు విడుదల చేశారు. కమిటీ తన నివేదిక ఇచ్చేందుకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు సమయం ఇచ్చారు. కమిటీ సభ్యుల పేర్లను ఫిబ్రవరి 3న ప్రకటించగా... విధి విధానాలను ఖరారు చేసేందుకు కేంద్రం దాదాపు 9 రోజుల సమయం తీసుకుంది. ఈ సమయంలో కాంగ్రెస్ కోర్ కమిటీ రెండుసార్లు విధివిధానాలను పరిశీలించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకే ఈ కమిటీ వేస్తున్నామన్న భావన రాకుండా ఉండేందుకు పలుమార్లు పదాలను మార్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ విధి విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. చివరి దశలో సీమాంధ్ర నేత కావూరి సాంబశివరావును, తెలంగాణ నేత కె. కేశవరావును కూడా అధిష్ఠానం విశ్వాసంలోకి తీసుకుంది. ఎవరికీ అభ్యంతరం లేని విధంగా, ఏ ప్రాంతంలోనూ వివాదాస్పదం కాకుండా విధ విధానాలు రూపొందించేందుకు కేంద్రం తీవ్రస్థాయిలో కసరత్తు చేసినా... ఫలితం లేకపోయింది. ఈ విధి విధానాలు తెలంగాణవాదులను సంతృప్తి పరచలేకపోయాయి. 'తెలంగాణ ఇచ్చేందుకే కమిటీ' అని కేంద్రం నేరుగా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో విధి విధానాల్లో 'సమైక్యాంధ్ర' డిమాండ్‌నూ చేర్చాల్సి వచ్చింది. ఇది సహజంగానే తెలంగాణవాదుల్లో అసంతృప్తికి కారణమైంది. 'రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలను' పరిశీలించాలనే అంశం కూడా కొంత గందరగోళానికి దారి తీసింది. పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం, 610 జీవో... ఇలా ఎలాంటి పరిణామాలు పరిశీలిస్తారో నిర్దిష్టంగా చెప్పకపోవడం అస్పష్టంగా ఉందని భావిస్తున్నారు. ఇటీవలి పరిణామాలు మహిళలు, పిల్లలు, విద్యార్థులు, మైనారిటీలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు తదితర వర్గాలపై ఎలాంటి ప్రభావం చూపాయో పరిశీలించాలనేది కూడా కమిటీ విధుల్లో ఒకటి! ' విద్యార్థులంటే సరే! పిల్లలపై ప్రభావాన్ని పరిశీలించడమేమిటి? ఇది హాస్యాస్పదంగా ఉంది' అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కమిటీ విధి విధానాల్లోని 5వ అంశంలో 'అన్ని వర్గాల ప్రజలను' అని చెప్పారు. 6వ అంశంలో మళ్లీ 'పరిశ్రమలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు' అంటూ రకరకాల సంఘాలతో చర్చించాలని ఏకరువు పెట్టారు. వీటి పేర్లను 5వ అంశంలోనే పేర్కొంటే సరిపోయేది కదా! అనేది మరో వాదన. 6వ అంశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం సూచనలు స్వీకరించాలని పేర్కొన్నారు. దీంతో ఈ కమిటీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీని సూచిస్తుందేమోననే అనుమానాలకు ఆస్కారం కల్పించినట్లయింది. మొత్తానికి... కమిటీ తన పని తాను చేసుకుంటుంటే, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ప్రశాంతంగా మారుతుందన్న విశ్వాసంతోనే ప్రభుత్వం కర్రవిరగకుండా పాము చావకుండా అనే రీతిలో విధి విధానాలను ప్రకటించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నేడు తొలి సమావేశం శ్రీకృష్ణ కమిటీ తొలి సమావేశం శనివారం జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు కమిటీ సభ్యులు భేటీ అవుతారు. విధి విధానాలు, భవిష్యత్ కార్యాచరణ, కార్యాలయ ఏర్పాటు తదితర అంశాలపై వీరు చర్చించే అవకాశముంది. ఈ భేటీ అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు జస్టిస్ శ్రీకృష్ణ విలేఖరులతో మాట్లాడతారని సమాచారం అందింది.