విధి విధానాలు ప్రకటించిన కేంద్రం
ప్రాతిపదికలపై భిన్నాభిప్రాయాలు
స్వాగతించిన సీమాంధ్ర కాంగ్రెస్
తెలంగాణలోనూ కొందరికి ఓకే! అటూ ఇటూ వ్యతిరేకించిన టీడీపీ తెలంగాణ వాదుల పెదవి విరుపు 'విచిత్ర' విధానాలంటూ వ్యాఖ్యలు నేడు కమిటీ తొలి సమావేశం
రణగొణ ధ్వనులను అదుపు చేయగలమని అధిష్ఠానం భావిస్తోంది. కమిటీ నివేదిక వచ్చేలోపు రాష్ట్రంలో పరిపాలనను చక్కదిద్దాలని యోచిస్తోంది. సీమాంధ్రలో పరిస్థితి చక్కబడిందని, తెలంగాణ కాంగ్రెస్ నేతలను విశ్వాసంలోకి తీసుకోగలిగితే ఇక్కడ కూడా ఇబ్బంది ఉండదని అంచనా వేస్తోంది. 'కృష్ణార్పణం' పదం ఒక్కటే! అర్థాలు మాత్రం ఎన్నో! జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి నిర్దేశించిన విధి విధానాలు సృష్టించిన సందేహాలు ఎన్నెన్నో! ఇక ప్రత్యేక రాష్ట్రం సంగతి కృష్ణార్పణమే అని తెలంాణవాదులు నిరాశ వ్యక్తం చేస్తుండగా... కేంద్రం తెలంగాణను శ్రీకృష్ణ కమిటీకి అప్పగించినందున, విధివిధానాలపై అభ్యంతరాలు ఎందుకని కొందరు సీమాంధ్ర నేతలు ప్రశ్నిస్తున్నారు. కమిటీ విధి విధానాలపై పార్టీలవారీగా, ప్రాంతాల వారీగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు దాదాపుగా అందరూ విధి విధానాలను స్వాగతించారు. ఇటు తెలంగాణలోనూ చాలామంది కాంగ్రెస్ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు మాత్రం ప్రాంతాలకు అతీతంగా అంతా పెదవి విరిచారు. ఈ విధి విధానాలపై టీఆర్ఎస్ నిప్పులు చెరిగింది. విద్యార్థి జేఏసీలదీ అదే మాట! తెలంగాణపై ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేందుకే ఈ కమిటీ ఏర్పడిందని భావించిన తెలంగాణ వాదులను ఈ విధి విధానాలు తీవ్రంగా నిరాశపరిచాయి. 'అప్రమత్తంగా ఉండండి' అని గురువారం విలేఖరులను హెచ్చరించిన కంద్ర హోంమంత్రి చిదంబరం... శుక్రవారం ఉదయం శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను చడీ చప్పుడు లేకుండా మీడియాకు విడుదల చేశారు. కమిటీ తన నివేదిక ఇచ్చేందుకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు సమయం ఇచ్చారు. కమిటీ సభ్యుల పేర్లను ఫిబ్రవరి 3న ప్రకటించగా... విధి విధానాలను ఖరారు చేసేందుకు కేంద్రం దాదాపు 9 రోజుల సమయం తీసుకుంది. ఈ సమయంలో కాంగ్రెస్ కోర్ కమిటీ రెండుసార్లు విధివిధానాలను పరిశీలించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకే ఈ కమిటీ వేస్తున్నామన్న భావన రాకుండా ఉండేందుకు పలుమార్లు పదాలను మార్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ విధి విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. చివరి దశలో సీమాంధ్ర నేత కావూరి సాంబశివరావును, తెలంగాణ నేత కె. కేశవరావును కూడా అధిష్ఠానం విశ్వాసంలోకి తీసుకుంది. ఎవరికీ అభ్యంతరం లేని విధంగా, ఏ ప్రాంతంలోనూ వివాదాస్పదం కాకుండా విధ విధానాలు రూపొందించేందుకు కేంద్రం తీవ్రస్థాయిలో కసరత్తు చేసినా... ఫలితం లేకపోయింది. ఈ విధి విధానాలు తెలంగాణవాదులను సంతృప్తి పరచలేకపోయాయి. 'తెలంగాణ ఇచ్చేందుకే కమిటీ' అని కేంద్రం నేరుగా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో విధి విధానాల్లో 'సమైక్యాంధ్ర' డిమాండ్‌నూ చేర్చాల్సి వచ్చింది. ఇది సహజంగానే తెలంగాణవాదుల్లో అసంతృప్తికి కారణమైంది. 'రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలను' పరిశీలించాలనే అంశం కూడా కొంత గందరగోళానికి దారి తీసింది. పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం, 610 జీవో... ఇలా ఎలాంటి పరిణామాలు పరిశీలిస్తారో నిర్దిష్టంగా చెప్పకపోవడం అస్పష్టంగా ఉందని భావిస్తున్నారు. ఇటీవలి పరిణామాలు మహిళలు, పిల్లలు, విద్యార్థులు, మైనారిటీలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు తదితర వర్గాలపై ఎలాంటి ప్రభావం చూపాయో పరిశీలించాలనేది కూడా కమిటీ విధుల్లో ఒకటి! ' విద్యార్థులంటే సరే! పిల్లలపై ప్రభావాన్ని పరిశీలించడమేమిటి? ఇది హాస్యాస్పదంగా ఉంది' అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కమిటీ విధి విధానాల్లోని 5వ అంశంలో 'అన్ని వర్గాల ప్రజలను' అని చెప్పారు. 6వ అంశంలో మళ్లీ 'పరిశ్రమలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు' అంటూ రకరకాల సంఘాలతో చర్చించాలని ఏకరువు పెట్టారు. వీటి పేర్లను 5వ అంశంలోనే పేర్కొంటే సరిపోయేది కదా! అనేది మరో వాదన. 6వ అంశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం సూచనలు స్వీకరించాలని పేర్కొన్నారు. దీంతో ఈ కమిటీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీని సూచిస్తుందేమోననే అనుమానాలకు ఆస్కారం కల్పించినట్లయింది. మొత్తానికి... కమిటీ తన పని తాను చేసుకుంటుంటే, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ప్రశాంతంగా మారుతుందన్న విశ్వాసంతోనే ప్రభుత్వం కర్రవిరగకుండా పాము చావకుండా అనే రీతిలో విధి విధానాలను ప్రకటించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నేడు తొలి సమావేశం శ్రీకృష్ణ కమిటీ తొలి సమావేశం శనివారం జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు కమిటీ సభ్యులు భేటీ అవుతారు. విధి విధానాలు, భవిష్యత్ కార్యాచరణ, కార్యాలయ ఏర్పాటు తదితర అంశాలపై వీరు చర్చించే అవకాశముంది. ఈ భేటీ అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు జస్టిస్ శ్రీకృష్ణ విలేఖరులతో మాట్లాడతారని సమాచారం అందింది.
No comments:
Post a Comment