శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బహుదా నదులున్నా ఉత్తరాంధ్రకు ఊతగర్ర, వ్యవసాయానికి జీవగర్ర, ఖచ్చితంగా వంశధారే. శ్రీకాకుళం జిల్లా సాహిత్యం, చరిత్ర, మానవ చరిత్రలకు ఆధారాలకు వంశధారే ఆలవాలం. ఒరిస్సా రాష్ట్రంలో కోరాపుట జిల్లాలో తూర్పు కనుమల్లో పుట్టిన వంశధార నది సాగర సంగమం వరకు సుమారు 263 కిమీ ప్రయాణించి కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలోకి చేరుతుంది. ఈ నది ఒరిస్సా రాష్ట్రంలో 154 కిమీ, ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో 29 కిమీ, శ్రీకాకుళం జిల్లాలో 82 కిమీ ప్రవహిస్తుంది. వంశధార రెండు రాష్ట్రాలలో ప్రవహించినా దాని పరివాహ ప్రాంతం అంతా తెలుగు భాషా ప్రాంతం అంటే అతిశయోక్తి కాదు. ఉత్కళాంధ్ర సమైక్యతకు, కళింగాంధ్ర సమగ్రతకు ప్రతీక వంశధార. స్వాతంత్య్రానంతరం కేంద్ర జలవనరుల సంఘం వంశధార నదీ జలాల ప్రవాహాన్ని అంచనావేసింది. జూలై 2007 అంచనా ప్రకారం వంశధార నదిలో నీటి ప్రవాహం 105 టిఎంసిలుగా నిర్ధారించి అందులో 75 శాతం మాత్రమే ఆధారపడినదగిన నీటి పరిమాణంగా పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే వంశధార నది నీటిలో 78.75 టిఎంసిల నీరు ఆధారపడదగిన పరిమాణంగా నిర్ధారించవచ్చు. అయితే వంశధార నది నీటిపై ఇంతకు ముందు అధ్యయనాలు వాటి ఫలితాలను కూడా పరిశీలిస్తే 1962లో నీటి పరిమాణాన్ని 115 టిఎంసిలుగాను, 1999లో 112.452 టిఎంసిలుగాను, 2007లో 105 టిఎంసిలుగాను కేంద్ర జలవనరుల సంఘం గుర్తించినట్టు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. వీటి సగటుని ఆధారంగా చేసుకుని చూసినా వంశధార నదిలో 110 టిఎంసిల నీటి పరిమాణం వున్నట్టు గుర్తించవచ్చు. అయితే తాజా లెక్కల ప్రకారం ఆధారపడదగిన నీటి ప్రవాహం (గొట్టా బారేజ ఎగువ ప్రాంతంలో) పరిగణించినా 78.75 టిఎంసిలు నీరు లభ్యత వుంటుందని చెప్పవచ్చు.వంశధార ఒప్పందాలు:
వంశధార నదీ జలాల పంపిణీ విషయంలో 1962కు పూర్వ ఆంధ్రప్రదేశ, ఒరిస్సా రాష్ట్రాల మధ్య ఒప్పందాలుగానీ, అంగీకారాలు కానీ లేవు. సెప్టెంబర 30, 1962న ఇరురాష్ట్రాల వంశధార నది నీటిని 50:50 నిష్పత్తిలో సరిసమానంగా వినియోగించుకోవాలని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇదే ఒప్పందాన్ని పునరుద్ఘాటిస్తూ 3-10-1962న మరోసారి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రత్యేక వర్తమానాలు అందచేసుకున్నారు. 10-6-1992, 30-12-1994 తేదీల్లో జరిగిన ముఖ్యమంత్రి స్థాయి సమావేశాల్లో కూడా నీటి జలాల వినియోగంలో 1962 ఒప్పందాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి బలపరుస్తూ ధృవీకరించారు. అందుచేత వంశధార నదీ జలాల పంపిణీలో ఎటువంటి విభేదం లేదని భావించవచ్చు.
వివాదానికి పునాదులు ఎక్కడ?
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వంశధార నదీ జలాల్లో వినియోగించుకుంటున్న నీటి పరిమాణం కేవలం 17.4 టిఎంసిలే. దానిని కూడా గొట్టా బ్యారేజి నిర్మాణం (1977) అనంతరం మాత్రమే వినియోగించుకోగలుగుతున్నది. గొట్టా బ్యారేజీకి ఎగువన నేరడి బ్యారేజీ నిర్మాణం జరపడం ద్వారా మరో 19 టిఎంసిల నీటి వినియోగించుకోవచ్చునని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదన ఒరిస్సా రాష్ట్రం ముందు 1960లోనే ఉంచడం జరిగింది. ఇందుకు సానుకూలంగా ఒరిస్సా రాష్ట్రప్రభుత్వం తన అంగీకారం తెలిపింది. ఈ అంగీకరించిన అంశాలలో ప్రధానమైంది కీలకమైనది భవిష్యత్తులో వివాదానికి కేంద్ర బిందువైనది ముంపు ప్రాంతం. 1961లో ఇచ్చిన అంగీకారంలో ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ముంపునకు గురయ్యే 106 ఎకరాలకు కూడా అభ్యంతరం లేదంటూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటికీ ఈ వివాదం నేరడి బ్యారేజి నిర్మాణం పైనగాని, అది నిర్మితమైన ప్రదేశంపైన గాని లేదు. 1961లో ఒరిస్సా రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని 1962, 1980, 1987, 1991, 1994లలో జరిగిన అంతర్‌రాష్ట్ర సమావేశాలలో ఒరిస్సా అంగీకరిస్తునే ఉంది. 1980లో వచ్చిన వంశధార వరదలలో సుమారు ఆరులక్షల క్యూసెక్కులు వంశధార నదిలో ప్రవాహంగా లెక్కించారు.ఇంతటి ప్రవాహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరడి బ్యారేజ్ నిర్మాణంలో పరిగణించలేదన్నది ఒరిస్సా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ దృష్టికి 1981లో తెచ్చింది. ఇందుకు అనుగుణంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం 22-6-1981న నేరడి బ్యారేజ్ రీడిజైన్ చేసేందుకు అంగీకరించింది. అలాగే 25-8-1985న జరిగిన మరో అంతర రాష్ట్ర సమావేశంలో మేగ్జిమమ్ ఫ్లడ్ లెవెల్ 74.40 మీటర్లుగా వుండాలని, కో ఎఫిషియంట్ డిస్‌చార్జి 2.95గా పేర్కొన్నప్పటికీ 2.8 మాత్రమే వుందని తన అభ్యంతరాలని ఒరిస్సా రాష్ట్రప్రభుత్వం తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా మార్పులు చేసి 10-9-1985న కేంద్ర జలవనరుల సంఘానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించింది. 8-4-1988, 10-6-1992 తేదీల్లో జరిగిన రెండు సమావేశాలలో ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం తనకు నేరడి బ్యారేజి వంశధార నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించడంపట్ల సమ్మతి తెలిపింది. అయితే నేరడి బ్యారేజీ ఎత్తును మాత్రం మేథమెటికల్ మోడల్ స్టడీ ప్రకారం నిర్ణయించాలని ప్రతిపాదించింది. ఈ విధంగా బ్యాక్‌వాటర్‌స, ముంపు ప్రాంతాలు, ప్రభావిత ప్రాంతాలను గుర్తించవచ్చన్నది ఒరిస్సా వాదన. ఇందుకు ఇరు రాష్ట్రాలు 10-7-1999న అంగీకరించాయి. దానికి అనుగుణంగా కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో స్టడీ జరిగింది. 31-5-2000న కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ నేరడి బ్యారేజీకి సంబంధించి టెక్నో-ఎకనామిక్ వయబిలిటీ మంజూరు చేసింది. అలాగే మేథమేటికల్ మోడల్ స్టడీ రిపోర్టు 27-6-2000న మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. దీనిని అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అవసరం కంటే ఎక్కువగా వున్నాయని, ముంపు, ప్రభావిత ప్రాంతాల రక్షణకు ఎటువంటి ఢోకా వుండబోదని కేంద్ర జలవనరుల సంఘం తేల్చి చెప్పడమే కాకుండా ఒరిస్సా రాష్ట్రం వ్యక్తం చేసిన అభిప్రాయాలు నిరాధారమైన అపోహలుగా తేల్చింది. నిజానికి ఇంతటితో ఈ వివాదం సద్దుమణగాల్సి వున్నప్పటికీ ఒరిస్సా రాష్ట్రం మేథమెటికల్ మోడల్ స్టడీ రిపోర్టును అంగీకరించలేదు. సరికదా ఫిజికల్ మోడల్ స్టడీ జరగాలని వాదనను ముందుకు తెచ్చింది. 15-2-1001న జరిగిన అంతర రాష్ట్ర సమావేశంలో ఒరిస్సా లేవనెత్తిన డిమాండ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ స్టడీ నిర్వహించేందుకు సిడబ్లు్యపిఆర్‌ఎస్, పుణెకు అప్పగించాలని ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. వివిధ రకాల అధ్యయనాల అనంతరం సిడబ్లు్యపిఆర్‌ఎస్ నివేదిక 28-2-2005న ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చేరింది. ఫిజికల్ మోడల్ స్టడీ, మేథమేటికల్ స్టడీ నిర్ధారించిన విషయాలు వాస్తవమేనని, నేరడి బ్యారేజి నిర్మాణంలో ఒరిస్సా వ్యక్తం చేస్తున్న ముంపు భయం వాస్తవం కాదని మరోసారి నిర్ధారించింది. అలాగే వంశధార నది 10.37, 11.96 (కాట్రగడ గ్రామం దగ్గర) కిమీల వద్ద కొద్దిగా అవరోధాన్ని తొలగించడం ద్వారా బ్యాక్‌వాటర్‌స, ముంపు ప్రభావాలను మరింతగా తగ్గించవచ్చునని నివేదిక స్పష్టం చేసింది. అయితే ఈ నివేదికను కూడా ఒరిస్సా ప్రభుత్వం అంగీకరించలేదు. ఇదే కాలంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశం 24-2-2005న జరిగింది. ఈ సమావేశంలో వంశధార ప్రాజెక్టు స్టేజ్2, ఫేజ్2పై ఇరు రాష్ట్రాల ఇంజనీర్లతో ఒక టెక్నికల్ ఎక్‌సపర్‌ట కమిటీని రూపొందించి మూడు నెలలలోగా నివేదిక వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే మూడు నెలల్లోగా ఇరు రాష్ట్రాలు ఎలాంటి పనులు చేపట్టరాదని కూడా నిర్ణయించడం జరిగింది. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం తరఫున కమిటీలో సభ్యులుగా వుండాల్సిన నిపుణుల జాబితాని రూపొందించి ఒరిస్సాకు పంపింది కానీ, ఆ రాష్ట్రప్రభుత్వం స్పందించలేదు. ఈ విధంగా మూడు నెలల కాలం గడిచిపోయిన అనంతరం (డెడ్‌లైన్ 23-05-2005తో ముగిసింది). 4-4-2006న ఒరిస్సా ప్రభుత్వం తాను నియమించదలుచుకున్న నిపుణులు పదవీవిరమణ చేసారని, అందుచేత నూతన కమిటీ అవసరమని తెలిపింది.ఈ కారణంవల్ల రెండు రాష్ట్రాలు అంగీకరించిన కమిటీ నిర్మాణంగాని, సమావేశాలుగాని జరగకుండానే సమయం ముగిసిపోయింది.
ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగా ఒరిస్సాతో వివాదం లేకుండా మన రాష్ట్ర భూభాగంలో కాట్రగడ్డ గ్రామం వద్ద సైడ్‌వియర్ నిర్మించి వరద నీటిని మళ్లించి సింగిడి, పారపురం బేలెన్సింగ్ రిజర్వాయర్లతోపాటుగా, హీరమండలం వద్ద 19టిఎంసి సామర్ధ్యంగల రిజర్వాయర్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 933 కోట్ల రూపాయలు కేటాయింపు జరిపింది.
మొత్తం వంశధార పనులు పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలో సుమారు 2,55,000 ఎకరాలకు ఆధారపడదగిన సాగునీటిని, సుమారు 8000 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కలుగుతుంది. ఈ సందర్భంగా కాట్రగడ్డ వద్ద నిర్మించే సైడ్‌వియర్ నిర్మాణం పూర్తిగా తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, నేరడి బ్యారేజి నిర్మాణంపై తుది నిర్ణయానికి లోబడే ఇది నిర్మితం అవుతుందని ఒరిస్సా ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాట్రగడ్డ సైడ్‌వియర్ మట్టం నదిమట్టం కంటే సుమారు 0.9 మీటర్లు ఎత్తుగా నిర్మించనుండడంవలన నదిలో నీటి వనరులు 4000 క్యుసెక్కులు వరకు అందుబాటులో కొనసాగుతుందని వివరించింది. అదేవిధంగా వరద కాలువ నీటి గరిష్ట సామర్ధ్యం 8000 క్యూసెక్కులు కావడం వలన అదనపు నీటిని ఆంధ్రప్రదేశ్ వంశధారనుంచి తరలించే అవకాశం కూడా వుండదని తెలియపరిచింది. అంతర్‌రాష్ట్ర సమావేశంలో (24-4-2006) ఈ విషయాలను ఒరిస్సా రాష్ట్రం ముందుంచారు. ఈ సమావేశంలోనే కాట్రగడ్డ సైడ్‌వియ్‌ర్ ద్వారా వంశధారనది ప్రవాహ దిశను మార్చే ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్ చేస్తున్నదన్న ఆరోపణ చేసింది. అందువల్ల ఈ అంశాలపై అనుమానాలు నివృత్తి చేసేందుకు మేథమెటికల మోడల స్టడీ లేదా ఫిజికల్ మోడల్ స్టడీ నిర్వహించి నిర్ణయించాలని సమావేశంలో తీర్మానించారు. దానిని అనుసరించి సిడబ్లు్యపిఆర్‌ఎస్ పుణె పరిశోధనలు చేసి జులై 2007లో తననివేదికను ఇరు రాష్ట్రాలకు పంపింది. ఒరిస్సా వాదనలు నిరాధారమని ఈ నివేదిక బహిరంగపరచగా ఈ నివేదికపై సైతం ఒరిస్సా తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఒరిస్సా అభ్యంతరాలపై మరోసారి అధ్యయనం చేసిన సిడబ్లు్యపిఆఱ్‌ఎస్ 12-3-2008, 24-3-2008 తేదీల్లో మరిన్ని వివరణలతో ఒరిస్సా రాష్ట్ర అభ్యంతరాలను అసమంజసంగా తేల్చి చెప్పంది. ఈ విధంగా ఒరిస్సా చేస్తున్న వాదనలు కేవలం ఊహాజనితమైనవిగా నిరూపితమైనాయి.
వంశధార సుప్రీంకోర్టు కేసు
ఒరిస్సా రాష్ట్రప్రభుత్వం ఒకవైపు చర్చలు నిర్వహిస్తునే 13-2-2006న సుప్రీంకోర్టులో రిట్‌పిటిషన 443/2006 దాఖలు చేసింది. ఈ కేసు అంతర నదీజలాల వివాద చట్టం పరిధిలో నమోదైంది. కేంద్ర ప్రభుత్వానికి ఇదే చట్టం పరిధిలోని సెక్షన 4 కింద ఒక సంవత్సరం గడువు వున్నప్పటికీ సమయం ముగియక ముందే కేసు దాఖలు చేసింది. ఇదే కేసులో కేంద్ర ప్రభుత్వం తన కౌంటర్‌ను దాఖలు చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, అంగీకారం సాధించగలనన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ కూడా తన వాదనలను వినిపించింది. భారత సుప్రీంకోర్టు 6.2.2009న ఒరిస్సా వాదనలను పాక్షికంగా అంగీకరిస్తూ వంశధార పనులపై స్టే విధించింది. వంశధారపై ట్రిబ్యునల్‌ను నియమించి శాశ్వతంగా స మస్య పరిష్కరించాలని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఫిబ్రవరి 2010లో కేంద్ర ప్రభుత్వం వంశధార ట్రిబ్యునల్‌ను నియమించింది. ఈ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారమైతేనే శ్రీకాకుళం జిల్లాలో వంశధార పరవళ్లు తొక్కుతుంది.
ఎడమ ప్రధాన కాలువ ద్వారా 1.48 లక్షల ఎకరాలు, కుడి ప్రధాన కాలువద్వారా 82 వేల ఎకరాలు, హైలెవల్ కాలువద్వారా 5 వేల ఎకరాలు, ఫ్లడ కాలువ ద్వారా 20వేల ఎకరాలు పూర్తిస్తాయిలో సాగులోకి వస్తుంది. ఇప్పటికి అర్ధశతాబ్దం పైగా నేరెడి బ్యారేజి నిర్మాం పెండింగ్‌లో పడిపోవడంవలన సుమారు 45 కోట్లతో నిర్మించాల్సిన బ్యారేజి వ్యయం ఇప్పుడు వెయ్యికోట్లకు చేరుకుంది.
రాష్ట్రంలో చివరాఖరి జిల్లాలో ప్రాజెక్టు కావడంవల్ల నిరాదరణకు వంశధార గురవుతుందన్న విమర్శలున్నా ఇప్పటికైనా అన్ని రాజకీయ పక్షాలు ఒక్కతాటిపై నిలిచి రైతులకు సాగునీటిని అందించే దిశగా కృషిచేయాలని ఆశిద్దాం.
- పాతులోతు పాండు నాయక్
No comments:
Post a Comment